Wednesday, October 9, 2013

Dasaraa navaraatrulu - First day - స్వర్ణ కవచ అలంకృత అమ్మవారు

 
 
 
ఒక సంవత్సరమునకు నవరాత్రులు రెండు సార్లు జరుపబడతాయి.
ఒకటి - దేవి నవరాత్రులు అనగా శారదా నవరాత్రులు (దసరా)
మరొకటి - వసంత నవరాత్రులు.
 
           శారదా నవరాత్రులు శ్రీ దేవి వైభవానికి ప్రతీక. తొమ్మిది రోజులు తొమ్మిది స్వరూపాలుగా అమ్మవారిని కొలుస్తాము. అమ్మవారి దయ కరుణ్యానికి సాటి, అంతము లేదు. అమ్మవారు కామధేనువు. భక్తితో కోరినంతనే సర్వమూ ప్రసాదించే కారుణ్య రూపం. దసరా నవరాత్రులలో అమ్మవారు 9 మనోహరమైన రూపాలతో దర్శనం ఇస్తుంది. ఈ జగమంతా నిండి ఉన్నది కేవలం ఒక్క పరబ్రహ్మ స్వరూపమే(శక్తి స్వరూపిని అయిన అమ్మవారు మాత్రమే అని భావం). అనగా ఉన్నది ఒక్క నిర్గుణ తత్వమే. అలా నిండి ఉన్న ఒక్క పరబ్రహ్మ తత్వమే మనకు ఇన్ని స్వరూపాలుగా (అనగా - శ్రీ అన్నపూర్ణ, శ్రీ బాలాత్రిపురసుందరి, శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతి, శ్రీ గాయత్రి, శ్రీ లలిత, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ మహిషాసురమర్దిని) భాషిస్తోంది.

జగన్మాత అయిన అమ్మవారు -

విద్యను ప్రసాదించునపుడు, శ్రీ సరస్వతి (శ్రీ శారద, శ్రీ వాగ్దేవి, శ్రీ మహా విద్య)గా అనుగ్రహిస్తుంది.
అదే శక్తిరూపిణి ఐశ్వర్యం కటాక్షించినప్పుడు శ్రీ మహా లక్ష్మిగ కొలువు తీరుతుంది.
మూడు లోకాలకు అన్నమును, ఉదకమును (నీరు) ఇచ్చునపుడు అన్నపూర్ణగా అవతరిస్తుంది.
శక్తిని అనుగ్రహించునపుడు - రాజరాజేశ్వరిగా దర్శనం ఇస్తుంది.
వేదాల ఙ్ఞానమును ప్రసాదించునపుడు గాయత్రి రూపధారి అయి కరుణిస్తుంది.
చివరకు మహిషాసురమర్దిని అవతారం తీసుకుంటుంది.

         ఎన్ని రూపాలు తీసుకున్నప్పటికి, అన్ని స్వరూపాలు అబేధములు. అంతయు ఆ శ్రీమాత వైభవస్వరూపాలే. పరబ్రహ్మానికి రూపము లేదు. తల్లి  ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. ఈ సృస్టిలో ఆమె కానిది ఏమి లేదు. రూపాలు (దుర్గా, గాయత్రి, కామాక్షి, మొ.) వేరు అయినప్పతికి, సాక్షాత్తు ఈ మూడు లోకాలు ఆ పరదేవత స్వరూపంతో నిండి ఉన్నాయి.
 
       ఈ దసరా నవరాత్రుల ప్రతిరోజు, అమ్మవారు తొమ్మిది స్వరూపాలుగా అవతారం తీసుకుంటుంది. 9 రోజులు ప్రతి అలంకరణకు సహస్ర నామంతో కుంకుమతో పూజించిన, ఎన్ని స్వరూపలతో కొలిచినా, ప్రతి రూపానికి అష్టోత్తరం చేసినా అవి అంతా శక్తి స్వరూపిని అయిన ఆ ఆది పరాశక్తి జగన్మాతకే.  
 
మూడు మూర్తులకును, మూడు రూపములకు, మూడు కాలములకు, మూలమగుచు బేధమగుచు, తుదకి అబేధ్యమయ్యావు బ్రహ్మము నీవే పాల నయనా. 
 
భావం: సర్వ దేవతా స్వరూపిణి అయిన అమ్మ, శక్తి ఒక్కరు మాత్రమే అని తెలిసే వరకు, సరస్వతి, లక్ష్మి, గాయత్రి, మొదలగు అన్ని రూపాలు వేరు వేరుగా అనిపించినా, అఖండ తేజోమయ శక్తిరూపం ఒక్కటే అని అనుభూతికి వచ్చిన తర్వాత అమ్మలందరు ఆ దివ్య మాత స్వరూపమే అని తెలియవస్తుంది.  
 
         తత్వము అనేక విధాలుగా ఉన్నా, పరబ్రహ్మం ఒక్కటే. తల్లి ఏ పేరుతో పిలిచినా, ఏ నామంతో పూజించినా తన భక్తులను ఆశీర్వదిస్తుంది. మహాలక్ష్మిగా అవతరణ దర్శనమిచ్చి, అష్టోత్తరంతో "బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమహ" అని కొలిచినా అది పరదేవతే. లలితా స్వరూపంలో దర్శనం ఇచ్చి - లలితా సహస్ర నామంతో "సృష్టికర్తై బ్రహ్మ రూప గోత్రి గొవింద రూపిణి సంహారిణి రుద్ర రూప తిరోదానకరి ఈశ్వరి" అని స్తుతించినా అది ఆ శక్తి రూపిణికే చేరుతుంది.
దసరా నవరాత్రులలో మొదటగా అమ్మవారు "స్వర్ణ కవచ అలంకృత" దర్శనం ఇస్తుంది.  
 
మూల కథ: 
                   పూర్వము దుర్గముడు అనె రాక్షసుడు బ్రహ్మ చేత వరాలు పొందుటకు తపస్సు చేసెను. తపస్సుకి ప్రసన్నుడైన బ్రహ్మని దుర్గముడు రెండు వరాలు కోరుకున్నాడు. ఒకటి - నాలుగు వేదములు తనలోకి ప్రవేశించాలి(అనగా వేదములు తనకి వశము అయి తనలోకి ప్రవేశించాలి. ఇది జరిగితే సమస్త ప్రజలు వేదములు మరచిపోతారు.) అని, రెండు - తను ఏ దేవుడు (అనగా ఏ పురుషుడు) చేతిలో సంహరించబడకూడదు అని కోరుకున్నాడు. బ్రహ్మ వరములను ప్రసాదించెను. అలా వరం పొందటం వలన - వేదములు తనలోకి ప్రవేశించగా, ఋషులు, ప్రజలు, దేవతలు మంత్రములు, వేదఙ్ఞానం కొల్పోయెను. దీనివల్ల యఙ్ఞ యాగాదులు జరగవు. దేవతలకు హవిస్సు అందదు. పూజలు హవిస్సు లేని కారణంగా పంటలు పండవు, వర్షము కురవదు. నీరు పారదు. కారణం ఇవి చేయటానికి మంత్రములు, వేద ఙ్ఞానము దుర్గముడిలోకి ప్రవేశించటం. ఋషులు, ప్రజలు అన్నపానీయములు లేక అలమటిస్తుండగా, ఋషులు అందరూ అమ్మవారి వద్దకు వెల్లి తమ సమస్యను చెప్పి, తమకి తిరిగి వేద ఙ్ఞానం కృప చేసి, సృష్టి నడిపించమని కోరెను. అమ్మవారు లోకాలను పోషించే జగన్మాత కనుక, మూడు లోకాల ముగ్గురమ్మల జగజ్జనని కనుక ఋషుల బాధను విని, ముందుగా శాకంబరి అవతారంలో కూరలు, పండ్లు, అన్నం, ఉదకం వెంటనే సృష్టించెను. ఇది ఆ తల్లి కారుణ్యం. మనం కోరినంతనే మనల్ని రక్షించుటకు సదా ఉంటుంది. ఋషులు, సకల ప్రాణులు ఇవి తిని ఆనందించుచుండగా, ఇవి అంతా చూసిన దుర్గముడు ఆగ్రహంతో వీరిపైన బాణములు ప్రయోగించెను. కాని అమ్మ శక్తిరూపిణి. తన పిల్లల పోషణ భరాన్ని తను సదా చూస్తుంది. రక్షణ చక్రం వేసి సమస్త ప్రాణులను దుర్గముడి బాణాల నుండి కాపాడుతుంది. దీనితో ఆగ్రహించిన దుర్గముడు అమ్మవారితో యుద్ధానికి సిద్ధం అయ్యెను. అమ్మవారు 11 రోజులు దుర్గమునితో పోరాడి 11వ రోజున దుర్గముని సంహరించెను.
 
            దుర్గముడిని సంహరించటం చేత అమ్మవారు దుర్గగా పిలువబడుతుంది. ఇది దుర్గ తత్వ విశేషము. దుర్గముడి సంహారం అనంతరం దుర్గ అమ్మవారు కనక వర్షం కురిపించి, కనక దుర్గ గా భక్తులను అనుగ్రహించింది. విజయవాడ కనకదుర్గమ్మగా మనల్ని దీవిస్తోంది.

       అమ్మవారు ఆరోజున స్వర్ణ కవచం ధరించి పోరాడి గెలిచినందున నేడు, దసరా నవరాత్రులలో మొదటగా అమ్మవారిని స్వర్ణ కవచంతో అలంకరించి, ఆభరణములతో శోభాయమానంగా అలంకరణ చేసి, దుర్గా స్తుతితో నవరాత్రలను ప్రారంభించవలెను.
 
       దేవి నవరాత్రులందు అమ్మవారిని స్వర్ణ కవచదుర్గగా దర్శించి అసుర సంధ్య వేలలో అమ్మవారిని శతాక్షిగా, శాకంబరిగా, దుర్గగా కొలిచి ప్రార్థించాలి. అలా చేసినవారికి అమ్మవారు సంపూర్ణ కటాక్షం లభిస్తుంది.
 
 
ఆమ్మవారి అలంకార రూపాలు:
1. స్వర్ణ కవచ అలంకృత అమ్మవారు
2. శ్రీ
బాల త్రిపురసుందరి స్వరూపం
3. శ్రీ
అన్నపూర్ణ స్వరూపం
4. శ్రీ
గాయత్రి స్వరూపం
5. శ్రీ
లలితా స్వరూపం
6. శ్రీ
సరస్వతి స్వరూపం
7. శ్రీ
మహా లక్ష్మి స్వరూపం
8. శ్రీ
దుర్గ (మహిషాసుర మర్దిని) స్వరూపం
9. శ్రీ రాజరాజేశ్వరి స్వరూపం.

శివార్పణం!!