Thursday, January 24, 2013

Sreeraama Navami - శ్రీరామ నవమి

శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
 
                 శ్రీ మహా విష్ణువు అవతారం అయినటువంటి శ్రీరామచంద్రుని జననమును మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాము. రామనామం రాముని కంటే శక్తివంతమైనది. రామనామం మనల్ని సకల సముద్రాలు దాటించగలదు. వాల్మీకి ప్రణితమైన "శ్రీమద్రామాయణం" కేవలం ఇతిహాసము అనియే కాక "ఆది కావ్యము" గా కీర్తికాంచినది. అట్టి సంస్కృతిలో పుట్టిన మనం ధన్యులం.
 
                  రావణనాసురుడు బ్రహ్మచే సకల వరాలు పొంది; దేవతలు, రాక్షసులు, గంధర్వుల చేత మరణం అనేది లేని వరాలు పొంది, సకల ఋషులను బాధపెట్టెను. వారు ఒక దినము శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్ళి, తమ కష్టాలను విన్నవించెను. రావణాసురుడు మానవులు అంటే చులకన భావముచేత వారిచే మరణం లేకుండునట్లు కోరలేదు. కాబట్టి శ్రీమహావిష్ణువు లోకకళ్యాణం కొరకు మానవ అవతారమున శ్రీరామచంద్రునిలా జన్మించెను. అట్టి మహావీరుని జననం మనం శ్రీరామనవమిగా చేసుకుంటున్నాము. ఇది ప్రధానమైన కారణం.

 
                 దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేసిన సంవత్సరకాలం తరువాత, పన్నెండవ మాసం చైత్ర శుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రం నాల్గవ పాదంలో, కర్కాటక లగ్నమున శ్రీరాముడు జన్మించెను. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, సుక్రుడు, శని అను అయిదు గ్రహములు ఉచ్చ స్థానములలో ఉండెను. అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన, తుల రాశులయందు ఉండిరి. లోకనాయకుడు శ్రీరాముడు జన్మించిన పవిత్ర సమయం.

 
                  సర్వ ధర్మస్వరూపుడు అయినటువంటి సకల గుణాభిరాముని జననం, లోక కల్యాణం అయినటువంటి సీతారామ కల్యాణం మరియు శ్రీరామ పట్టాభిషేకం (అనగా శ్రీరామచంద్రుడు, సీతాసమేతముగా అయోధ్యకు తిరిగి వచ్చిన పిదప జరిగిన పట్టాభిషేకం) కూడా పలు చోట్ల శ్రీరామనవమిగా చేస్తారు.


మా ఇంట పూజా విధానం:

సాధారణ పూజ చేసుకుని, కొవెలకి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీస్కోవటం. సుందరకాండ పారాయణ, రామాయణ గ్రంథ పఠనం, సీతారామ కళ్యాణం చూడటం ద్వారా మనం శ్రీసీతారాములకు చేరువ అవుతాం.